: పార్టీ ఓటమి దిశగా యోగేంద్ర యాదవ్, శాంతి భూషణ్ లు పనిచేశారు: ఆప్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి దిశగా సీనియర్ నేతలు శాంతి భూషణ్, ఆయన కుమారుడు, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ లు పనిచేశారంటూ ఆమ్ ఆద్మీ ఓ ప్రకటన విడుదల చేసింది. గతంలో లోక్ పాల్ ఉద్యమం నుంచి కేజ్రీవాల్ తో ఉన్న ప్రశాంత్ భూషణ్.. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ తరపున తాను ప్రచారం చేయడంలేదని, మీరు కూడా చేయొద్దని ఇతర రాష్ట్రాల పార్టీ నేతలను ఒప్పించేందుకు ప్రయత్నించారని పేర్కొంది. కేజ్రీకి ఒక గుణపాఠం అవసరమని భూషణ్ అన్నట్టు తెలిపింది. అంతేగాక పార్టీకి విరాళాలు ఇవ్వొద్దని ప్రజలను ఆపే ప్రయత్నం కూడా చేసినట్టు ఆప్ ప్రకటనలో చెప్పింది. ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి పార్టీ నాయకత్వాన్ని బెదిరించే ప్రయత్నం చేశారని, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కీర్తిని అప్రదిష్టపాలుచేసే ప్రయత్నం కూడా చేసినట్టు వివరించింది. అటు మీడియాలో అరవింద్ పై వ్యతిరేక కథనాలు చేసి ఆయన ఇమేజ్ ను దెబ్బతీసేందుకు యేగేంద్ర యాదవ్ కూడా ప్రయత్నించినట్టు తమ వద్ద సాక్ష్యాలున్నాయని చెప్పింది.