: వరల్డ్ కప్ లో నరాలు తెగే పోరు... ఇంగ్లండ్ ఇంటికి, క్వార్టర్స్ లో బంగ్లాదేశ్


అడిలైడ్ లో నేడు సిసలైన క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టు 15 పరుగుల తేడాతో ఇంగ్లండును చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించింది. ఈ ఓటమితో ఇంగ్లండ్ జట్టు వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించింది. టోర్నీలో ఇప్పటిదాకా 5 మ్యాచ్ లు ఆడిన బంగ్లా జట్టు 3 విజయాలతో గ్రూప్ లో మూడోస్థానంలో నిలిచింది. ఇక, ఇంగ్లండ్ జట్టు కూడా 5 మ్యాచ్ లు ఆడినా కేవలం ఒక్క విజయంతో సరిపెట్టుకుంది. తాజా మ్యాచ్ విషయానికొస్తే 276 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లండ్ 48.3 ఓవర్లలో 260 పరుగులకు ఆలౌటైంది. బట్లర్ (65), బెల్ (63), వోక్స్ (42 నాటౌట్) రాణించినా ప్రయోజనం లేకపోయింది. 4 వికెట్లతో బంగ్లా పేసర్ రూబెల్ హుస్సేన్ ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. మొర్తజా, తస్కిన్ అహ్మద్ చెరో 2 వికెట్లతో సత్తా చాటారు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 275 పరుగులు చేసింది. మహ్మదుల్లా సెంచరీ నమోదు చేశాడు. వరల్డ్ కప్ చరిత్రలో బంగ్లా జట్టు తరపున ఇదే తొలి సెంచరీ కావడం విశేషం.

  • Loading...

More Telugu News