: దేశం మమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి: జయదేవ్
భూసేకరణ విషయంలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని దేశం ఆదర్శంగా తీసుకోవాలని ఆ పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ తెలిపారు. లోక్ సభలో ఆయన మాట్లాడుతూ, ఎలాంటి చట్టం చేయకుండా రాజధాని నిర్మాణం కోసం 33 వేల ఎకరాలు సేకరించిన ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమని అన్నారు. గతంలో ఛత్తీస్ గఢ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భూసేకరణ చేపట్టి ఎంత వ్యతిరేకత ఎదుర్కొన్నారో దేశం మొత్తానికి తెలుసని ఆయన పేర్కొన్నారు. రైతులకు లాభదాయకమైన ప్యాకేజీతో పాటు, వసతులు కల్పించడంతో ప్రభుత్వానికి రైతులు సహకరిస్తున్నారని, రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కొంటే ప్రతిఘటిస్తారని ఆయన తెలిపారు. దేశంలో భూసేకరణపై కొత్త విధానానికి టీడీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఆయన అభిప్రాయపడ్డారు.