: రైతుల భూములతో మీరెలా రియల్ వ్యాపారం చేస్తారు?: చంద్రబాబు సర్కారుపై జగన్ ఆగ్రహం
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం పేరిట ఏపీ సర్కారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. నేటి ఏపీ శాసనసభ సమావేశాల్లో భాగంగా రాజధాని నిర్మాణం, భూ సమీకరణపై అధికార పార్టీ సభ్యుల ప్రసంగానికి అడ్డు తగిలిన ఆయన, రైతుల భూములతో మీరెలా రియల్ వ్యాపారం చేస్తారని నిలదీశారు. యజమానులుగా రైతులకు సదరు భూముల్లో సాగు కాకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే హక్కుందని పేర్కొన్న జగన్, రాజధాని నిర్మాణం పేరిట ఆ భూముల్లో మీరెలా వ్యాపారం చేస్తారని ప్రశ్నించారు. అధికార పక్ష సభ్యులు నోరు తెరిస్తే అబద్ధాలు చెబుతున్నారని ఆయన ఆరోపించారు. జగన్ వ్యాఖ్యలపై అధికార పక్ష సభ్యులు నిరసన వ్యక్తం చేశారు.