: మీ ఆక్రోశానికి నేను సైతం గొంతు కలిపా: మోదీ
జమ్మూకాశ్మీర్ జైలు నుంచి వేర్పాటువాద నేత మసరత్ ఆలమ్ విడుదలపై ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటులో స్పందించారు. ఆలమ్ విడుదల తరువాత దేశవ్యాప్తంగా ప్రజలు నిరసన వ్యక్తం చేసిన సంగతి తనకు తెలుసునని అన్నారు. మీ ఆక్రోశానికి తాను సైతం గొంతు కలిపానని గుర్తు చేశారు. అవసరమైనప్పుడే రాజకీయాలు చేయాలని, ప్రతి విషయంపైనా రాద్దాంతం కూడదని విపక్షాలకు సలహా ఇచ్చారు. సభ్యుల ఆందోళనతో ఏకీభవిస్తానని తెలిపారు. సంకీర్ణ ప్రభుత్వంలో బీజేపీకి తెలియకుండానే పీడీపీ నిర్ణయం తీసుకుందని వివరించారు. అంతకుముందు, కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇదే విషయమై పార్లమెంట్లో ప్రకటన చేశారు. విపక్షాల నినాదాల మధ్య ఆయన మాట్లాడుతూ, ఈ విషయంలో కాశ్మీర్ సర్కారు నుంచి నివేదిక అందిందని తెలిపారు. ఈ నివేదికపై ఉన్న సందేహాలను నివృత్తి చేయాలని ముఫ్తీ ప్రభుత్వాన్ని కోరామని, జవాబు రాగానే సభ్యులకు తెలియజేస్తామని అన్నారు. దేశ భద్రత విషయంలో తమ ప్రభుత్వం ఏ దశలోనూ రాజీపడబోదని తెలిపారు.