: చర్చకు సిద్ధం... ఏ అంశంపై అయినా, ఎంతసేపైనా: తెలంగాణ సీఎం కేసీఆర్
శాసనసభలో ఏ అంశంపై అయినా, ఎంతసేపైనా చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. జాతీయ గీతానికి అవమానం విషయంలో టీ టీడీపీ సభ్యుల సస్పెన్షన్, కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ క్షమాపణ అనంతరం సభలో ఆయన ప్రసంగించారు. జాతీయ గీతం పట్ల అవమానకరంగా వ్యవహరించిన వారిలో అధికార పార్టీ సభ్యులున్నా ఉపేక్షించేది లేదని కూడా కేసీఆర్ స్పష్టం చేశారు. సభా కార్యక్రమాలను జరగనివ్వబోమని ప్రతిపక్షాలు చెబుతున్నాయన్న ఆయన, సభను జరిపి తీరతామని తేల్చిచెప్పారు. ఈ క్రమంలో అవసరమనుకుంటే విపక్ష సభ్యులను ఎన్నిసార్లు సస్పెండ్ చేయడానికైనా వెనుకాడేది లేదని ఆయన ఉద్ఘాటించారు. తెలంగాణ ఆత్మగౌరవానికి ఎవరు భంగం కలిగించినా సహించేది లేదని కేసీఆర్ స్పష్టం చేశారు.