: వ్యాపారం వదిలి దానధర్మాలు చేసుకో... ఫేస్ బుక్ అధినేత జుకర్ బర్గ్ కు సునీల్ మిట్టల్ సలహా


మొబైల్‌ ఫోన్లలో ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించే దిశగా ఫేస్‌ బుక్‌ అడుగులేస్తున్న నేపథ్యంలో టెలికాం జెయింట్ భారతీ ఎయిర్‌ టెల్‌ చీఫ్‌ సునీల్‌ మిట్టల్‌ స్పందించారు. ఉచితంగా ఇంటర్నెట్‌ ఇవ్వాలని భావిస్తే, వ్యాపారం జోలికి రాకుండా దాతృత్వ కార్యక్రమాలు నిర్వహించుకోవాలని ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ కు ఆయన సూచించారు. ఇంటర్నెట్‌ డాట్‌ ఓఆర్‌జీ పేరిట ఫేస్‌ బుక్‌ తయారీ యాప్‌ వాడుతూ, భాగస్వామ్య టెలికాం ఆపరేటర్‌ ద్వారా వెళితే ఇంటర్నెట్‌ సదుపాయం ఉచితంగా లభిస్తుంది. ఎంపిక చేసిన వెబ్‌సైట్లను ఈ యాప్‌ ద్వారా ఉచితంగా చూడవచ్చు. అయితే ఫేస్ బుక్ ఆలోచన అమలైతే, మొబైల్ సేవలందిస్తున్న కంపెనీలు భారీగా నష్టపోతాయి. ఇక ఇతర కంపెనీలు కూడా మొబైల్ ఇంటర్నెట్ పై చార్జ్ చేయడం ఆపేసి దానధర్మాలు చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు. స్పెక్ట్రం కోసం తాము వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం తరంగాలను ఉచితంగా ఇస్తే తాము కూడా ఆయన దారిలో నడుస్తామని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాగా, వోడాఫోన్‌ చీఫ్‌ విటోరియా కొలాయో సైతం జుకర్‌ బర్గ్‌ ఆలోచనను తప్పుబట్టారు. ఉచిత ఇంటర్నెట్‌ ఆలోచన అంటే ఇతరుల డబ్బును తను దానంగా ఇవ్వడం వంటిదని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News