: ‘తెలంగాణ రభస’ వీడియో ఫుటేజీ పరిశీలన... బెంచీలెక్కిన వారిపై చర్యల దిశగా చర్చ
తెలంగాణ అసెంబ్లీలో మొన్నటి గవర్నర్ ప్రసంగం సందర్భంగా జరిగిన రభసకు సంబంధించిన వీడియో ఫుటేజీలను స్పీకర్ మధుసూదనాచారి పరిశీలిస్తున్నారు. నేటి ఉదయం తన ఛాంబర్ లో ఆయా పార్టీల ఫ్లోర్ లీడర్లతో సమావేశమైన ఆయన, నాటి గొడవపై చర్చిస్తున్నారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా పోడియంలోకి దూసుకెళ్లిన టీడీపీ సభ్యులను టీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తమపై టీఆర్ఎస్ సభ్యులు దాడికి దిగారని టీడీపీ సభ్యులు ఆరోపిస్తున్నారు. నాటి టీఆర్ఎస్ సభ్యుల దాడిలో తమ సభ్యులు గాయపడ్డారని కూడా టీ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు చెప్పారు. అయితే నేటి ఉదయం సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే ఫ్లోర్ లీడర్లతో సమావేశమైన స్పీకర్, సదరు ఘటనకు సంబంధించిన చర్యలపై సమాలోచనలు చేస్తున్నారు. గొడవ సందర్భంగా సభలో బెంచీలపైకి ఎక్కిన వారిపై చర్యలు తీసుకునే దిశగా చర్చలు సాగుతున్నట్లు సమాచారం.