: రైతు సమస్యలపై వైసీపీ వాయిదా తీర్మానం... విడ్డూరమన్న కాల్వ శ్రీనివాసులు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చకు అనుమతించాలని వైసీపీ వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించింది. అయితే దీనిని స్పీకర్ కోడెల శివ ప్రసాద్ తిరస్కరించారు. దీంతో రైతు సమస్యలపై చర్చకు అనుమతించాల్సిందేనని వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా స్పందించిన చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు, రైతు సమస్యలపై వైసీపీ వాయిదా తీర్మానం ఇవ్వడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. కాల్వ శ్రీనివాసులు వ్యాఖ్యలపై వైసీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. రైతు సమస్యలపై చర్చకు తమ ప్రభుత్వం సిద్ధంగానే ఉందని చెప్పిన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, తర్వాత చర్చిద్దామని ప్రతిపాదించారు. అయినా వైసీపీ సభ్యులు తమ ఆందోళనను విరమించలేదు. పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియంను చుట్టుముట్టడంతో ఎలాంటి చర్చ జరగకుండానే ప్రారంభమైన వెంటనే సభను స్పీకర్ వాయిదా వేశారు.