: డబుల్ బెడ్ రూం ఫ్లాట్ అన్నావ్... ఒక్క ఇల్లన్నా కట్టిచ్చావా కేసీఆర్ ?: ఉత్తమ్ కుమార్
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుపై పీసీసీ తాజా చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. పీసీసీ పగ్గాలు అందుకున్న అనంతరం మాట్లాడుతూ... తాము అధికారంలో ఉన్నప్పుడు లక్ష రూపాయలతో ఇళ్లు కట్టించి ఇస్తే వాటిపై విమర్శలు చేశారని, అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లని, కాళ్లు చాపుకుంటే కష్టమని నానా మాటలు అన్నారని గుర్తు చేశారు. అదే కేసీఆర్, మూణ్నాలుగు లక్షల రూపాయలతో డబుల్ బెడ్ రూం ఫ్లాట్లు కట్టిస్తామని ఎన్నికల వేళ హామీ ఇచ్చారని తెలిపారు. మార్చి నాటికి ఒక్క ఇల్లన్నా కట్టిచ్చావా కేసీఆర్? అంటూ ఈ సందర్భంగా ప్రశ్నించారు. "కేసీఆర్ కరీంనగర్ వెళ్లి ఆ నగరాన్ని న్యూయార్క్ చేస్తానని అంటాడు. హైదరాబాదును ఓసారి సింగపూర్ చేస్తానని, మరోసారి ఇస్తాంబుల్ చేస్తానని, ఇంకోసారి డల్లాస్ చేస్తానని అంటాడు" అని ఎద్దేవా చేశారు. అవేవీ వద్దని, సామాన్యుడికి మేలు చేసే పనులు చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి హితవు పలికారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని, మహిళ సంఘాలను ఆదుకోవాలని సూచించారు.