: చివర్లో చేతులెత్తేసిన లంక... కంగారూలను వరించిన విజయలక్ష్మి


సిడ్నీ మ్యాచ్ లో సంగక్కర (104) శతకం వృథా అయింది. ఆసీస్ తో పోరులో శ్రీలంక జట్టు 64 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 377 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన లంక జట్టు సంగా, దిల్షాన్ (62) రాణించడంతో మెరుగైన స్థితిలోనే నిలిచింది. వారు అవుటైన తర్వాత కూడా, గెలుపు తీరానికి చేరుతున్నట్టే కనిపించింది. అయితే, మెరుపు బ్యాటింగుతో ఆసీస్ కు చుక్కలు చూపించిన దినేశ్ చాందిమల్ (24 బంతుల్లో 52) రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరగడంతో పతనం దిశగా సాగింది. అటు పిమ్మటే కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ (35) అవుట్ కావడంతో లంకకు ఓటమి తప్పలేదు. ఆ జట్టు 46.2 ఓవర్లలో 312 పరుగులు చేయగలిగింది. చివర్లో 29 పరుగుల తేడాతో 5 వికెట్లు చేజార్చుకుంది. అంతకుముందు, టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. గ్లెన్ మ్యాక్స్ వెల్ (53 బంతుల్లో 102) విధ్వంసక ఇన్నింగ్స్ కు తోడు స్మిత్ (72), క్లార్క్ (68), వాట్సన్ (67) సమయోచిత ప్రదర్శన చేయడంతో ఆసీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 376 పరుగులు చేసింది. లంక బౌలర్లను కకావికలం చేసిన మ్యాక్స్ వెల్ కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అందజేశారు. ఈ విజయంతో ఆసీస్ క్వార్టర్స్ బెర్తు దాదాపు ఖాయమైంది.

  • Loading...

More Telugu News