: ఆత్మహత్యకు పాల్పడిన ప్రియురాలిని ప్రియుడి ఇంట్లోనే సమాధి చేశారు!
నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం తాళ్లసింగారం గ్రామంలో ఓ యువతిని ఆమె ప్రియుడి ఇంటి ఆవరణలోనే సమాధి చేసిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే... వసంత, మహేశ్ ప్రేమికులు. కొంతకాలంగా వసంత పెళ్లి చేసుకోవాలని ప్రియుడిని కోరుతోంది. అయితే, అతడు అంగీకరించలేదు. మహేశ్ ధోరణిలో మార్పు రాకపోవడంతో వసంత శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. పురుగుల మందు తాగి ప్రాణాలు విడిచింది. దీంతో, ఆమె బంధువులు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. వసంత మరణానికి కారణం ప్రియుడేనని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. మృతదేహంతో మహేశ్ ఇంటి ఎదుట బైఠాయించారు. అయితే, నష్టపరిహారం చెల్లించేందుకు మహేశ్ కుటుంబ సభ్యులు నిరాకరించడంతో, వసంత మృతదేహాన్ని అతని ఇంటి ఆవరణలోనే పూడ్చిపెట్టారు. ఈ వ్యవహారంలో వసంత బంధువులకు గ్రామస్థులు కూడా మద్దతుగా నిలిచారు.