: చట్టాలున్నా ప్రయోజనం లేదు... మగవాళ్లు మారాలి: రోజా
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నటి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా తన అభిప్రాయాలను వెల్లడించారు. తిరుపతిలో పలువురు ప్రతిభావనులను సత్కరించిన సందర్భంగా ఆమె ప్రసంగించారు. చట్టాలున్నా ప్రయోజనం కనిపించడం లేదని, మహిళలపై నానాటికీ దాడులు తీవ్రమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి మారాలంటే పురుషుల ఆలోచనల్లో మార్పు రావాలని అన్నారు. మహిళా సాధికారత ఎక్కడా కనిపించడం లేదని విచారం వ్యక్తం చేశారు. మహిళలు అన్నిరంగాల్లో సత్తా చాటుతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లోనూ ఇంకా అణచివేత వైఖరి కొనసాగుతోందని తెలిపారు.