: ప్రణబ్ ముఖర్జీ ఉద్దీపన కాంగ్రెస్ కొంపముంచింది: చిదంబరం
ఆర్థికమాంద్యం నుంచి దేశాన్ని గట్టెక్కించాలన్న ఉద్దేశంతో 2008-09లో యూపీఏ ప్రవేశపెట్టిన ఉద్దీపన ప్యాకేజి కాంగ్రెస్ ఓటమికి ఒక కారణంగా నిలిచిందని మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తరపున ప్రకటించిన ప్యాకేజి దేశ ఆర్థిక వ్యవస్థను ఒడిదుడుకుల్లోకి నెట్టిందని అన్నారు. దీనివల్ల ద్రవ్యోల్బణం పెరిగిందని తెలిపారు. ఆహార, వస్తు ఉత్పత్తుల ధరల పెరుగుదల ప్రజల్లో యూపీఏపై వ్యతిరేకతను పెంచిందని తెలిపారు. ఆ ప్యాకేజి వల్ల ఆదాయ లోటు, ద్రవ్య లోటు, కరెంటు ఖాతాల లోటు లక్ష్యాలను అందుకోలేకపోయామని వివరించారు. ద్రవ్యోల్బణం ఏకంగా 14 శాతానికి చేరుకుందని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 2008-09లో ఆర్థికమంత్రిగా విధులు నిర్వహిస్తూ, ఉద్దీపన ప్యాకేజి ప్రకటించారు.