: గోల్స్ వర్షం కురిపించిన భారత మహిళలు
మహిళల హాకీ వరల్డ్ లీగ్ రౌండ్-2 పోటీల్లో ఇండియా శుభారంభం చేసింది. ఘనాతో శనివారం జరిగిన మ్యాచ్ లో మహిళా ఆటగాళ్లు గోల్స్ వర్షం కురిపించారు. ఆరంభం నుంచి భారత జట్టు ఎదురుదాడికి దిగడంతో పాటు ఆద్యంతం ఆధిపత్యం చలాయించడంతో 13-0 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. భారత జట్టులో ఎనిమిది మంది క్రీడాకారిణులు గోల్స్ చేయడం విశేషం. వందనా కటారియా 8, 21, 48, 56వ నిమిషాల్లో గోల్స్ చేయగా, జస్ ప్రీత్ కౌర్ 53, 57వ నిమిషాల్లో, రాణి రాంపాల్ 23, 33వ నిమిషాల్లో రెండేసి గోల్స్ చేశారు. దీప్ ఎక్కా, మోనిక, పూనమ్ రాణి, అమన్ దీప్ కౌర్, లిలిమా మిన్జ్ ఒక్కో గోల్ సాధించారు. మిగతా లీగ్ మ్యాచ్ లలో మలేసియా 8-0తో కజకిస్థాన్ పై, రష్యా 7-0తో సింగపూర్ పై, పోలండ్ 4-1తో థాయ్ లాండ్ పై విజయం సాధించాయి. నేడు జరిగే మరో లీగ్ మ్యాచ్లో పోలండ్ తో భారత్ తలపడుతుంది.