: ఆ సమస్య రైనాది కాదు... మీడియాదే: ధోనీ
షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్న సురేష్ రైనాను కెప్టెన్ ధోనీ సమర్థించాడు. ఇటీవల వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో సైతం రైనా షార్ట్ పిచ్ బంతితోనే పెవిలియన్ దారి పట్టాడు. ఈ సమస్య రైనాది కాదని, అసలు సమస్య మీడియాదేనని అన్నాడు. ఈ తరహా బంతులకు పలు దేశాల ఆటగాళ్లు అవుట్ అవుతారని వెల్లడించిన ధోనీ, మీడియాకు మాత్రం రైనా ఒక్కడే కనిపిస్తున్నాడని రుసరుసలాడాడు. తనవరకైతే రైనా బాగానే ఆడుతున్నాడని అన్నాడు. గతంలో ఐదో నంబర్ స్థానంలో వచ్చి యువరాజ్ తప్ప ఆటగాళ్లెవరూ విజయవంతం కాలేదని గుర్తు చేసిన ఆయన, విరాట్, రోహిత్ లను కూడా ఆడించి ప్రయోగం చేసినా ఫలితం దక్కలేదని, అందువల్ల రైనాకు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని అన్నాడు. మ్యాచ్ సమయంలో తాను కూడా ఒత్తిడికి గురవుతానని, అయితే దాన్నుంచి ఎలా బయటపడాలో తనకు తెలుసునని అన్నాడు.