: ఫ్యాక్టరీలు కడితేనే అభివృద్ధా? వ్యవసాయం చేస్తే నాశనమైపోతారా?: సురవరం
ఫ్యాక్టరీలు కడితేనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందా? అని సీపీఐ జాతీయ నేత సురవరం సుధాకర్ రెడ్డి ప్రశ్నించారు. ఖమ్మం జిల్లాలో సీపీఐ జాతీయ మహాసభల్లో ఆయన మాట్లాడుతూ, వ్యవసాయం చేస్తే నాశనమైపోతారా? అని నిలదీశారు. మన తాత తండ్రులంతా వ్యవసాయం చేసి, మనల్ని ఈ స్థాయికి తీసుకురాలేదా? అని ఆయన ప్రశ్నించారు. భూసేకరణ చట్టం ద్వారా కేంద్రం దేశ ప్రజలను భ్రష్టుపట్టించాలని కంకణం కట్టుకుందని ఆయన పేర్కొన్నారు. ఓబామా వచ్చి వ్యూహాత్మక బంధం పేరిట పెట్టుబడిదారులకు కొమ్ము కాయాలని కోరుకుంటే...మోదీ దానిని అమలు చేస్తూ దేశ రైతులకు సమాధులు తవ్వుతున్నారని అన్నారు. కొత్త భూసేకరణ చట్టం ద్వారా, రైతుల నుంచి భూములు సేకరించిన అనంతరం రైతులకు పరిహారం ఇవ్వరు, ప్రాజెక్టుల నుంచి నీళ్లివ్వరు, బోర్లు వేసుకునేందుకు అవకాశం ఇవ్వరని అన్నారు. భవిష్యత్ లో భారతీయులు అని చెప్పుకునేందుకు పెట్టుబడి దారులకు మాత్రమే అవకాశం ఉంటుందని, రైతు అనేవాడు నాశనమైపోతాడని ఆయన తెలిపారు. మోదీ ప్రయత్నాలు అడ్డుకోవాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. 'మిత్రులం' అంటూ అమెరికా మన దేశాన్ని నాశనం చేసే ప్రణాళికలు వేస్తోందని ఆయన తెలిపారు. మిత్ర దేశంగా రష్యా, విశాఖపట్టణం, భిలాయ్ వంటి చోట్ల స్టీల్ ప్లాంట్లు నిర్మించి ఇచ్చిందని. స్నేహమంటే అది అని ఆయన సూచించారు.