: హరీష్ ఉసిగొలిపితేనే టీఆర్ఎస్ గూండాలు దాడి చేశారు... కేసీఆర్ పై చర్య తీసుకోవాలి: రేవంత్ ఫైర్
తెలంగాణ తెలుగుదేశం ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల తొలి రోజునే టీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. అసెంబ్లీలో టీడీపీ నేతలపై టీఆర్ఎస్ నేతలు చేసిన దాడిపై మండిపడ్డారు. కేవలం నిరసన తెలియజేయడానికే టీడీపీ సభ్యులు పోడియంలోకి వెళ్లారని... ఆ సమయంలో హరీష్ రావు ఉసిగొల్పితే, టీఆర్ఎస్ పార్టీ గూండాలు తమ నేతలపై దాడి చేశారని ఆరోపించారు. పోట్లగిత్తలు, ఎడ్ల మాదిరి దాడి చేశారని అన్నారు. ఈ రోజు ప్రజాస్వామ్యానికి దుర్దినమైతే, కేసీఆర్ దొరతనానికి మాత్రం శుభదినమని ఎద్దేవా చేశారు. దాడికి సంబంధించిన వీడియోను విడుదల చేయాలని, దాడి చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం చూస్తూనే కూర్చున్నారని, ఆయన నాయకత్వంలోనే ఇదంతా జరిగిందని... ఆయనపై గవర్నర్ చర్య తీసుకోవాలని రేవంత్ డిమాండ్ చేశారు.