: వీధి రౌడీల్లా ప్రవర్తించారు... టీ టీడీపీ సభ్యుల తీరుపై టీఆర్ఎస్ విమర్శ
శాసనసభలో టీ టీడీపీ సభ్యులు వీధి రౌడీల్లా వ్యవహరించారని టీఆర్ఎస్ ఆరోపించింది. గవర్నర్ ప్రసంగం సందర్భంగా ప్రసంగం ప్రతులను చించి గవర్నర్ పై విసిరేసిన టీ టీడీపీ సభ్యులు సభా గౌరవాన్ని మంటగలిపారని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. సభ సోమవారానికి వాయిదా పడిన అనంతరం మీడియా పాయింట్ వద్ద టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ టీ టీడీపీ సభ్యుల వ్యవహార సరళిపై నిప్పులు చెరిగారు. సమస్యలను చట్టసభల్లో చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన టీ టీడీపీ ఎమ్మెల్యేలు, అందుకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుని సభా మర్యాదను మంటగలిపారని దుయ్యబట్టారు. చివరకు జాతీయ గీతాన్ని కూడా అవమానపరిచేలా టీ టీడీపీ నేతలు వ్యవహరించారని ఆక్షేపించారు.