: భారత మత్స్యకారులకు లంక ప్రధాని వార్నింగ్!
భారత మత్స్యకారులు తమ జలాల్లోకి అక్రమంగా ప్రవేశిస్తే, వారిని కాల్చేస్తామని, తమ చట్టం అందుకు అనుమతిస్తుందని శ్రీలంక ప్రధాని రనిల్ విక్రమసింఘే హెచ్చరించారు. చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న తంత్రి టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. చేపల వేట హక్కులను పరిరక్షించుకునేందుకు ఇండియాతో ఒప్పందం కుదుర్చుకునేందుకు తమ ప్రభుత్వం సిద్ధమని చెప్పారు. "ఎవరైనా నా ఇంటిపై దాడికి ప్రయత్నిస్తే, వారిని నేను కాల్చేస్తా. ఈ ఘటనలో అతను చనిపోతే, నాకు చట్టపరమైన రక్షణ ఉంటుంది. మత్స్యకారుల విషయంలోనూ ఇంతే. మా వాదనకు బలమైన కారణాలు ఉన్నాయి. జాఫ్నా ప్రాంతంలో మా నీరు ఉంది. చేపల వేటకు ఇక్కడికి భారతీయులు వస్తున్నారు. ఇది సమంజసం కాదు. ఎట్టి పరిస్థితుల్లో భారత మత్స్యకారులను మా ప్రాంతంలో కాలు పెట్టనివ్వం" అని ఆయన అన్నారు. గతంలో లంక సైన్యం అమాయకులపై కాల్పులు జరిపిన ఘటనను ప్రస్తావిస్తూ, అది మనవ హక్కుల ఉల్లంఘన కిందకు రాదని, సైన్యం పడవలను ఆపాలని చేసిన హెచ్చరికలను వారు పరిగణనలోకి తీసుకోవాల్సిందని అన్నారు.