: త్వరలోనే విద్యుత్ సమస్యను అధిగమిస్తాం: తెలంగాణ ఉభయ సభల్లో గవర్నర్
తెలంగాణలో త్వరలోనే విద్యుత్ సమస్యను అధిగమిస్తామని గర్నవర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తూ, కాకతీయ మిషన్ ద్వారా 45 వేల చెరువుల పునరుద్ధరణకు చర్యలు చేపడుతున్నామన్నారు. సంక్షేమ పథకాలను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామని చెప్పిన ఆయన, ఈ ఏడాది 5.3 శాతం వృద్ధి నమోదు కానుందన్నారు. వాటర్ గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇస్తామన్నారు. హైదరాబాదులో వై-ఫై సేవలను అందిస్తామన్నారు. ఎమ్మెల్యే నిధులను రూ.1.5 కోట్లకు పెంచుతున్నట్లు ఆయన ప్రకటించారు. సింగిల్ విండో ద్వారా పరిశ్రమలకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేస్తామన్నారు. రాష్ట్రం కొత్త ఒరవడితో ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు. వాల్మీకీ, బోయలను ఎస్టీల్లో చేరుస్తామని ప్రకటించారు. కళ్యాణ లక్ష్మీ పథకాన్ని మరిన్ని వర్గాలకు విస్తరిస్తామన్నారు. దళితులకు మూడెకరాల భూమిని పంపిణీ చేస్తామన్నారు. హౌసింగ్ స్కీంలో చోటుచేసుకున్న అవినీతిపై విచారణను కొనసాగిస్తామని గవర్నర్ ప్రసంగించారు. విపక్షాల నిరసనల నేపథ్యంలో గవర్నర్ తన ప్రసంగాన్ని 15 నిమిషాల్లోనే ముగించారు. గవర్నర్ ప్రసంగం అనంతరం సభ సోమవారానికి వాయిదా పడింది.