: విభజన తరువాత ఎంతో పోగొట్టుకున్నాం!: నరసింహన్
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆదాయాలు తెచ్చిపెట్టే వనరులు కరవయ్యాయని గవర్నర్ నరసింహన్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా, అభివృద్ధి అజెండాను ముందుకు తెచ్చామని ఆయన తెలిపారు. విజన్ 2050 డాక్యుమెంట్‌ను రూపొందిస్తున్నామని, 2029 నాటికి ఏపీని ఉత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నది తన ప్రభుత్వ తపనగా ఆయన తెలిపారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల్లో ఏపీకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని చెప్పిన ఆయన, అభివృద్ధి దిశగా కేంద్రం సాయపడుతుందని ఆశిస్తున్నట్టు వివరించారు. కేంద్ర బడ్జెట్ లో నిధులివ్వకున్నా, 2018 నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు కేవలం రూ.100 కోట్ల స్వల్ప మొత్తం కేటాయించడం అసంతృప్తిని కలిగించిందని చెప్పారు. గవర్నర్ ప్రసంగం ముగియగానే అసెంబ్లీని వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ కోడెల ప్రకటించారు.