: 11న తెలంగాణ, 12న ఏపీ బడ్జెట్... 13న ఏపీ సాగు బడ్జెట్!
కేంద్ర బడ్జెట్ లో నరేంద్ర మోదీ సర్కారు తెలుగు రాష్ట్రాల ప్రజలను తీవ్ర నిరాశకు గురి చేసింది. తాజాగా తెలుగు రాష్ట్రాల బడ్జెట్లు కూడా జనం ముందుకు రానున్నాయి. మరి ఈ బడ్జెట్లైనా జనాన్ని ఆకట్టుకుంటాయో, లేదో చూడాల్సి ఉంది. నేటి నుంచి ఏపీ, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాల్లో భాగంగా ఈ నెల 11న తెలంగాణ బడ్జెట్ సభ ముందుకు రానుండగా, ఏపీ బడ్జెట్ ఈ నెల 12న జనం ముందుకు రానుంది. ఇక గత బడ్జెట్ లోనే వ్యవసాయ బడ్జెట్ పేరిట కొత్త సంప్రదాయానికి తెరతీసిన చంద్రబాబు సర్కారు, ఈ ఏడాది వ్యవసాయ బడ్జెట్ ను ఈ నెల 13న సభలో ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే ఏపీ లోటు బడ్జెట్ లో ఉండగా, నిన్నటిదాకా మిగులులో ఉన్న తెలంగాణ ఆర్థిక పరిస్థితి కూడా లోటు దిశగా సాగుతోంది. దాదాపు లక్ష కోట్ల రూపాయల మేర భారీ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న ఇరు రాష్ట్రాలు... అందులో నిధుల లభ్యత, వినియోగం తదితరాలపై ఏ తరహా చర్యలను ప్రకటిస్తాయోనన్న అంశంపై తెలుగు ప్రజల్లో ఆసక్తి నెలకొంది.