: తెలుగు రాష్ట్రాల ‘బడ్జెట్’ సమావేశాలు మరికాసేపట్లో... సర్కారుల నిలదీతకు విపక్షాలు సిద్ధం!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మరొకొద్ది సేపట్లో ప్రారంభం కానున్నాయి. రెండు రాష్ట్రాల శాసన సభా సమావేశాల్లో భాగంగా తొలుత ఏపీ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించనున్న ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ఆ తర్వాత తెలంగాణ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రెండు రాష్ట్రాల బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నగర పోలీసులు ఇప్పటికే పకడ్బందీ ప్రణాళికలు రచించారు. సీఎంలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వాహనాల రాకపోకలు, పార్కింగ్ తదితర అంశాలపై సమగ్ర ప్రణాళిక సిద్ధమైంది. ఇదిలా ఉంటే, ఇరు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరుపై ప్రతిపక్షాలు విరుచుకుపడేందుకు సిద్ధమయ్యాయి. నవ్యాంధ్ర రాజధాని విషయంలో రైతుల నుంచి సమీకరించిన భూమి, పరిహారం చెల్లింపు తదితరాలపై విపక్షం వైసీపీ చంద్రబాబు సర్కారును నిలదీసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. సర్కారు ప్రజా వ్యతిరేక చర్యలను ఎండగట్టేందుకు ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో కసరత్తు చేశారు. మరోవైపు తెలంగాణలో ఆకర్ష్ పథకంతో తమను బెంబేలెత్తిస్తున్న కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడేందుకు అటు కాంగ్రెస్ తో పాటు ఇటు టీడీపీ కూడా ప్రత్యక్ష యుద్ధానికి దిగనుంది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా జరగనున్నాయి.