: విమానాన్ని 180 డిగ్రీల కోణంలో ల్యాండ్ చేయడం సాహసమే... ఫోర్డ్ నిజంగా హీరోనే!
హారిసన్ ఫోర్డ్ సినిమాల్లోనే కాదు... పలు సందర్భాల్లో నిజజీవితంలో కూడా హీరో అని నిరూపించుకున్నారు. 1966లో పైలట్ లైసెన్స్ పొందిన ఫోర్డ్ 2000వ సంవత్సరంలో టెటాన్ కౌంటీ (అమెరికా)లోని ఇడాహో ఫాల్స్ వద్ద గల పర్వతాల్లో 11,106 అడుగుల ఎత్తులో చిక్కుకున్న ఓ మహిళా పర్వతారోహకురాలిని ప్రాణాలకు తెగించి తన విమానంలో వెళ్లి రక్షించారు. 2001లో ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ అడవుల్లో తప్పిపోయిన బాలుడిని సాహసోపేతంగా రక్షించి తీసుకొచ్చారు. గతేడాది స్టార్‌వార్స్ ఏడో ఎపిసోడ్ షూటింగ్ సందర్భంగా మిలీనియం ఫెలికాన్ స్పేస్ క్రాఫ్ట్ తలుపు విరిగిపడడంతో తన కాలు విరిగినా లెక్క చేయకుండా, కోలుకోగానే షూటింగ్‌ను పూర్తి చేశారు. తాజా ప్రమాదంలో కూడా విమానంలో సాంకేతిక లోపం గుర్తించగానే ఏ మాత్రం తొట్రుపాటుకు లోనవ్వకుండా, విమానాశ్రయంలోని సిబ్బందిని సంప్రదించి ల్యాండింగ్ కు అనుమతి అడిగాడు. వారు అనుమతించడంతో అటువైపు మళ్లించిన ఫోర్డ్ విమానం అంతదూరం వెళ్లే అవకాశం లేదని గుర్తించి, జనావాసాలను తప్పించుకుని గోల్ఫ్ కోర్టు వైపు మళ్లించాడు. అక్కడ చెట్లకు తగిలి విమానం పేలిపోకుండా 180 డిగ్రీల కోణంలో ల్యాండ్ చేశాడు. ఇది అత్యంత సాహసోపేతమైన నిర్ణయమని నిపుణులు ఫోర్డ్ సాహసాన్ని కొనియాడుతున్నారు. ప్రస్తుతం ఫోర్డ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.