: గుంటూరు రైతులకు ఇబ్బందా?... అయితే, విశాఖ రైతులు సిద్ధంగా ఉన్నారు: అయ్యన్నపాత్రుడు
గుంటూరులో రాజధాని నిర్మాణానికి రైతులు సంసిద్ధత వ్యక్తం చేయని పక్షంలో విశాఖ జిల్లా రైతులు భూములిచ్చేందుకు సుముఖంగా ఉన్నారని మంత్రి అయ్యన్నపాత్రుడు తెలిపారు. రైతు కన్నీళ్లతో రాజధాని నిర్మాణం వద్దు అన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై విశాఖలో ఆయన స్పందించారు. గుంటూరు రైతులు రాజధాని నిర్మాణానికి స్వచ్ఛందంగా భూములిచ్చారని అన్నారు. మనస్ఫూర్తిగా భూములు ఇవ్వలేని పక్షంలో విశాఖపట్టణంలో రైతులు భూములిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, విశాఖను రాజధానిగా ప్రకటించాలని ఆయన పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ పర్యటన అనంతరం ఎవరికి వారు వ్యాఖ్యలు చేస్తుండడంతో మంత్రి నారాయణ అందరూ సంయమనం పాటించాలని, పవన్ కల్యాణ్ సూచనలు పరిగణనలోకి తీసుకుంటామని ప్రకటించిన సంగతి తెలిసిందే.