: రైతుల ప్యాకేజీకి ప్రభుత్వ గ్యారెంటీ ఉండాలి... సేకరించిన భూమి రాజధానికి ఉపయోగపడాలి: పవన్
నవ్యాంధ్ర రాజధాని కోసం సేకరించిన భూమి, ఈ క్రమంలో రైతులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన ప్యాకేజీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని పరోక్షంగా ప్రశ్నించారు. పంటలు పండే భూములను రైతుల ఆమోదం లేకుండా సేకరించకూడదన్నారు. మూడుపంటలు పండే భూములు ఇవ్వలేమని పెనుమాక గ్రామస్థులు అంటున్నారన్నారు. పూల తోటలు, కూరగాయలు పండే పొలాల్లో ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీ సరిపోదన్నదే రైతుల ఆవేదన అని చెప్పారు. కొత్తగా ఏర్పడే రాష్ట్ర రాజధానికి కొందరి ఏడుపు కూడా తగలకూడదన్నదే తన ఉద్దేశమని పవన్ తెలిపారు. ఇదిలాఉంటే ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీ పట్ల కూడా ప్రజలు గ్యారెంటీ కోరుతున్నారన్నారు. సర్కారు సేకరించిన 30వేల ఎకరాల్లో ఎంత వేగంగా అభివృద్ధి చేయగలరు? సేకరించిన భూమి కచ్చితంగా ప్రభుత్వానికీ, రైతులకూ ఉపయోగపడుతుందా? అని పవన్ అనుమానం వ్యక్తం చేశారు. కాబట్టి భూసేకరణలో రైతులకు అన్యాయం జరగకూడదన్నారు. అన్యాయం జరిగితే రైతులకు నష్టం వాటిల్లవచ్చన్నారు. ఒకప్పుడు పోలేపల్లి సెజ్ విషయంలోనూ అదే జరిగిందని, అప్పుడు కూడా రైతులు చాలా బాధపడ్డారని గుర్తు చేశారు. ప్రభుత్వం 33వేల ఎకరాలు ఒక్కసారిగా ఇచ్చేయమంటే రైతు కూలీలు కూడా చాలా నష్టపోతారన్నారు. సింగపూర్ కంటే ఏపీ రాజధాని పెద్దదిగా ప్లాన్ చేయడం సంతోషమేనని, అటువంటి రాజదాని నిర్మాణానికి రాజకీయ నిబద్ధత ఉండాలని, సేకరించిన భూమి సరిగా ఉపయోగపడాలని పవన్ కోరారు.