: విజయనగరం యువకులకు నెల్లూరు జిల్లా మాజీ ఎమ్మెల్సీ టోకరా... బలిజపేటలో కేసు నమోదు
ఆయన పేరు రాధాకృష్ణయ్య. సొంతూరు నెల్లూరు జిల్లా. రాష్ట్రంలో పెద్దల సభ శాసన మండలి సభ్యుడిగా కొనసాగారు. పదవీకాలం ముగియడంతో మాజీ ఎమ్మెల్సీ అయ్యారు. విజయనగరంలో నిరుద్యోగ యువకులపై వల విసిరారు. ఐసీడీఎస్ లో ఉద్యోగాలున్నాయంటూ ప్రచారం మొదలెట్టాడు. మాజీ ఎమ్మెల్సీ కదా, యువకులు కూడా నమ్మేశారు. ఆయన అడిగిన మేర రూ. 15 లక్షలను ముట్టజెప్పారు. నెలలు గడుస్తున్నాయే కాని, ఉద్యోగాల జాడ లేదు. రాధాకృష్ణయ్య ఆచూకీ కూడా లభించడం లేదు. దీంతో మోసపోయామని తెలుసుకున్న యువకులు పోలీసులను ఆశ్రయించారు. బలిజపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, రంగంలోకి దిగి రాధాకృష్ణయ్య అనుచరులుగా భావిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, మాజీ ఎమ్మెల్సీ ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు.