: బీబీసీకి నోటీసులు జారీ చేసిన కేంద్రం
నిర్భయ గ్యాంగ్ రేప్ కు సంబంధించి వివాదాస్పద డాక్యుమెంటరీ ‘ఇండియాస్ డాటర్’ను బీబీసీ ప్రసారం చేయడంపై కేంద్రం నోటీసులు అందజేసింది. భారత్ సూచనలను పక్కకు పెట్టి ప్రసారం చేయడంపై కేంద్రం మండిపడింది. ప్రసారం చేయడంతోనే ఆగకుండా, ఆ వీడియోను యూట్యూబ్ లో కూడా అప్ లోడ్ చేసింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. బీబీసీకి లీగల్ నోటీసులు పంపింది. ఒప్పందానికి విరుద్ధంగా ఆ డాక్యుమెంటరీని వ్యాపార అవసరాలకు వాడుకున్నందున చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సిందిగా నోటీసులో పేర్కొంది. ‘‘డాక్యుమెంటరీని వ్యాపార అవసరాలకు వాడుకునేందుకు ముందు బీబీసీ ఎలాంటి అనుమతి తీసుకోలేదు. అందుకే నోటీసు ఇచ్చాం. స్పందన కోసం ఎదురుచూస్తున్నాం’’ అని హోంశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మహిళ దినోత్సవం సందర్భంగా మార్చి 8వ తేదీన ఆ వీడియోను ప్రసారం చేయాల్సి ఉండగా, ముందుగానే ప్రసారం చేయడం ఆశ్చర్యం కలిగించిందని హోం శాఖ వెల్లడించింది.