: జగన్ పై పవన్ కల్యాణ్ సెటైర్లు
వైకాపా అధినేత జగన్ పై జనసేనాని, సినీ నటుడు పవన్ కల్యాణ్ విమర్శనాస్త్రాలు సంధించారు. ఇటీవలే జగన్ మాట్లాడుతూ, వైకాపా అధికారంలోకి వచ్చాక రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి బలవంతంగా లాక్కున్న భూములన్నింటినీ వెనక్కి తిరిగి ఇచ్చేస్తామన్న సంగతి తెలిసిందే. జగన్ చేసిన ఈ వ్యాఖ్యలపై... రాజధాని ప్రాంత గ్రామాల్లో పర్యటిస్తున్న పవన్ విరుచుకుపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం తాను రాలేదని, ఐదేళ్ల తర్వాత అధికారంలోకి వస్తే భూములు ఇస్తానని తాను చెప్పడం లేదని, కేవలం రైతులకు న్యాయం చేయడానికే వచ్చానని... జగన్ పై సెటైర్ విసిరారు. వైయస్ హయాంలో వాన్ పిక్ కోసం వేలాది ఎకరాల భూమిని లాక్కున్నారని... అందులో ఒక ఎకరం భూమిని కూడా వినియోగించలేదని విమర్శించారు. ఇలాంటి ఘోరాలు వైయస్ హయాంలో ఎన్నో జరిగాయని అన్నారు. కేవలం వైకాపాకు చెందిన గ్రామాల వారే భూసేకరణను వ్యతిరేకిస్తున్నారని కొంత మంది మంత్రులు తనతో అన్నారని... అయితే, రైతులు ఏ పార్టీకి చెందినవారన్నది తనకు ముఖ్యం కాదని, వారికి న్యాయం జరగాలన్నదే తనకు ప్రధానమని పవన్ స్పష్టం చేశారు. ఐదేళ్ల తర్వాత న్యాయం చేస్తానని తాను కబుర్లు చెప్పడం లేదని... ఈ క్షణం నుంచే తాను రైతుల తరపున పోరాటం చేస్తానని అన్నారు.