: రైతుల మనోభావాలను చంద్రబాబుకు వివరిస్తా... చర్చల తర్వాత మళ్లీ మిమ్మల్ని కలుస్తా: పవన్
ఏపీ రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ రైతులు, అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. రాజధాని కోసం చాలా మంది రైతులు ఇప్పటికే ప్రభుత్వానికి భూములను అప్పగించారని, కొంతమంది మాత్రం వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన ల్యాండ్ పూలింగ్ విధానంతో కొంత మంది రైతుల మనోభావాలు గాయపడ్డాయని... రైతుల మనోభావాలపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చిస్తానని తెలిపారు. ప్రభుత్వంతో చర్చించిన తర్వాత మిమ్మల్ని మళ్లీ కలుస్తానని రైతులనుద్దేశించి అన్నారు. కేంద్రం తీసుకొస్తున్న భూసేకరణ చట్టం ద్వారా కూడా రైతులకు అన్యాయం జరగదని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ చెప్పారన్న విషయాన్ని గుర్తు చేశారు. రైతు బాగుంటేనే దేశం కానీ, రాష్ట్రం కానీ బాగుంటుందని పవన్ చెప్పారు.