: ఎగ్జిబిషన్ లో ప్రదర్శనకు నోబెల్ వీలునామా
ప్రఖ్యాత పురస్కారం 'నోబెల్' నెలకొల్పిన ఆల్ఫ్రెడ్ నోబెల్ వీలునామాను త్వరలో ఎగ్జిబిషన్ లో ప్రదర్శనకు ఉంచబోతున్నారు. సాహిత్యం, శాంతి, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, వైద్య రంగాల్లో అత్యున్నత కృషి చేసిన వ్యక్తులకు తన పేరుపై అవార్డును అందించాలని తన మరణానికి ముందు ఆయన ఓ వీలునామా రాశారు. ఇందుకోసం తన ఆస్తి మొత్తాన్ని అవార్డుల పేరుపైనే రాశారు. తరువాత 1896లో నోబెల్ కన్నుమూశారు. ఇప్పటివరకు ఆ వీలునామాను బహిరంగంగా ప్రదర్శించడంగానీ, ఎవరూ చూడటంగానీ జరగలేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 13నుంచి స్టాక్ హోమ్ లో 'లెగసీ' పేరుతో జరగనున్న ఎగ్జిబిషన్ లో వీలునామాను ప్రదర్శించబోతున్నట్టు నోబెల్ ఫౌండేషన్ వెల్లడించింది. ఇదే సమయంలో పలువురు ప్రముఖ వ్యక్తులు చనిపోయే ముందు రాయించిన వీలునామాలను కూడా ప్రదర్శనకు ఉంచనున్నారు.