: ప్రేమంటే ఇదేరా... ప్రియుడి కోసం దొంగగా మారి అడ్డంగా దొరికిన ప్రేయసి
ప్రేమించిన వాడి అవసరాలను తీర్చడమే తన పని అనుకుందో ఏమో, ఓ అపర ప్రేమికురాలు దొంగగా మారి పోలీసులకు దొరికిపోయి జైలుపాలైంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన పొన్నుగంటి ప్రవల్లిక (19) హైదరాబాదులోని యూసుఫ్ గూడలో తల్లితో కలిసి నివసిస్తూ, అదే ప్రాంతంలో ఉండే జిలానీని ప్రేమిస్తోంది. మంచి బైక్ కొనాలని ఉందని చెప్పిన ప్రియుడి కోరిక కాదనలేక తాను పనిచేస్తున్న ఇంట్లో బంగారం దొంగతనం చేసి, అమ్మి ఆ వచ్చిన సొమ్ముతో జిలానీకి బైక్ కొనిచ్చింది. జూబ్లీహిల్స్, ఉమెన్ కో ఆపరేటివ్ సొసైటీలో నివాసం ఉంటున్న కే.ఎల్.ఎస్.ఎన్.శర్మ ఇంట్లో పని చేస్తూ, పలుమార్లు వారి బంగారాన్ని కొద్దికొద్దిగా చోరీచేస్తూ వచ్చింది. ఈ డబ్బుతో మల్టీఫ్లెక్స్ లు, ఐస్ క్రీం పార్లర్లు తిరిగి జల్సాలు చేయడమేకాక, ప్రియుడికి బంగారు చైన్ కూడా చేయించింది. శర్మ దంపతులు మాత్రం బంగారాన్ని దయ్యాలే మాయం చేస్తున్నాయన్న మూఢ నమ్మకంతో పూజలు చేయిస్తూ ఉండిపోయారు. చోరీలు ఆగకపోవడంతో, బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ప్రవల్లికే దొంగని తేల్చారు. నిందితురాలిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్టు పోలీసులు తెలిపారు.