: వరుణ్ ఆరోన్ బౌన్సర్ స్టువర్ట్ బ్రాడ్ ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీసిందట!
భారత ఫేసర్ వరుణ్ ఆరోన్ చేతి నుంచి దూసుకువచ్చిన బౌన్సర్ తనను ఇంకా వెంటాడుతూనే ఉందని ఇంగ్లండ్ ఫేసర్ స్టువర్ట్ బ్రాడ్ పేర్కొంటున్నాడు. ఆరోన్ బౌన్సర్ తన ముఖానికి తగిలిన సందర్భంగా కలిగిన భయం ఇంకా తనను వీడలేదని అతడు చెబుతున్నాడు. గతేడాది మాంచెస్టర్ లో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ సందర్భంగా ఆరోన్ విసిరిన బౌన్సర్, బ్రాడ్ హెల్మెట్ గ్రిల్స్ నుంచి లోపలికి దూసుకెళ్లింది. దీంతో బ్రాడ్ ముక్కు, కంటికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం బ్రాడ్ ఆస్పత్రికీ వెళ్లాల్సి వచ్చింది. నాటి ఘటనకు సంబంధించి ఇప్పటికీ తనకు పీడకలలు వస్తుంటాయని బ్రాడ్ పేర్కొంటున్నాడు. ‘‘బంతి ముఖానికి తగిలినట్లనిపించి నిద్ర లేచేస్తున్నా. అలసిపోయినప్పుడు బంతులు నా ముఖం వైపు దూసుకొస్తున్నట్లనిపిస్తుంది. ఆ బంతి నా ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీసింది’’ అని బ్రాడ్ భయంభయంగా చెబుతున్నాడు.