: రెండు రోజులుంటే మద్యం విక్రయాలపై పెను ప్రభావం... ఊరట కోసం హైకోర్టుకు ఏపీ సర్కారు
తెలుగు రాష్ట్రాల బీవరేజెస్ కార్పొరేషన్లకు చెందిన డిపోలకు ఐటీ నోటీసులు, డిపోల జప్తు... తెలంగాణలో ఓ కొలిక్కి వచ్చినా, ఏపీలో పెను నష్టాన్నే సృష్టించనుంది. ఇప్పటికే రెండు రోజులుగా ఏపీలోని పలు జిల్లాల్లో ఐఎంఎల్ డిపోలు మూతపడ్డాయి. అయినా సరిపడ మద్యం నిల్వలు మద్యం షాపులకు చేరిపోయిన నేపథ్యంలో పెద్దగా ప్రభావాన్ని చూపలేదు. అయితే ఇదే పరిస్థితి మరో రెండు రోజుల పాటు కొనసాగితే, రాష్ట్రంలో మద్యం విక్రయాలపై పెను ప్రభావం పడనుంది. దీంతో మేల్కొన్న చంద్రబాబు సర్కారు, హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. ఐటీ శాఖ చర్యలపై కోర్టుకు వెళ్లనున్న సర్కారు, ఆ చర్యలను కొంతకాలం పాటు వాయిదా వేయాలని కోరనుంది. ఈ మేరకు అబ్కారీ శాఖ కమిషనర్, నిన్న రాత్రి అడ్వొకేట్ జనరల్ ను ప్రత్యేకంగా కలిసి కేసు పూర్వాపరాలను వివరించారు. దీంతో నేడు అడ్వొకేట్ జనరల్ ప్రభుత్వం తరఫున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు.