: కోహ్లీ హద్దుల్లో ఉండు...వివాదం రేపకు: బీసీసీఐ కార్యదర్శి
టీమిండియా యువ ఆటగాడు విరాట్ కోహ్లీ ఓ పాత్రికేయుడిపై నోరుపారేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దీనిపై బీసీసీఐ నూతన కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. వివాదాలకు స్వస్తి చెప్పి ప్రపంచకప్ పై దృష్టి పెట్టమని సూచించారు. భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోకూడదని ఆయన హెచ్చరించారు. భవిష్యత్ కెప్టెన్ గా భావిస్తున్న వ్యక్తి నుంచి దేశ ప్రజలు అలాంటి ప్రవర్తనను హర్షించరని ఆయన పేర్కొన్నారు. కాగా, కోహ్లీ, అనుష్కశర్మల ప్రేమాయణంపై ఓ పత్రిక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం రాసింది అక్కడున్న పాత్రికేయుడే అని భావించిన కోహ్లీ అతనిని నోటికి వచ్చిన బూతులు తిట్టాడు. కోహ్లీ నుంచి అలాంటి స్పందనను ఆ జర్నలిస్టు సహా ఎవరూ జీర్ణించుకోలేకపోయారు. దీంతో ఆ కథనం రాసింది సదరు జర్నలిస్టు కాదని తెలుసుకుని వేరే జర్నలిస్టుతో రాయబారం పంపిన సంగతి తెలిసిందే.