: 'మేల్ ఎస్కార్ట్' అంటూ మోసం చేస్తున్న కి'లేడీ' అరెస్ట్
ప్రముఖ పత్రికల్లో ప్రకటనలు ఇస్తూ, మేల్ ఎస్కార్ట్ (మగ వేశ్య)గా అవకాశం ఇస్తామని, వేలకు వేలు సంపాదన ఉంటుందని తన కమ్మటి కంఠంతో మాయమాటలు చెప్పి పలువురిని మోసం చేసిన ఓ యువతిని సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ నూర్ ఖాన్ బజార్ కు చెందిన ఫరీన్ నాజ్ గత నాలుగేళ్ల నుంచి సిమ్రాన్ ఫ్రెండ్స్ క్లబ్ పేరిట ప్రకటన ఇస్తోంది. ఇందులో మధ్య తరగతి, హైక్లాస్ మహిళలతో ఫ్రెండ్ షిప్ చేయిస్తామంటూ కాంటాక్ట్ అడ్రస్ ఇచ్చింది. దీన్ని చూసి ఫోన్ చేసిన వారిని ముందుగా బ్యాంకులో రూ. 5 వేలు డిపాజిట్ చేయాలంటూ, తదుపరి అవకాశాల గురించి తీయగా చెబుతూ, అవతలి వ్యక్తిని బుట్టలో వేస్తుంది. ఆపై తమకు ఇంకా 'అవకాశం' రాలేదని ఫోన్ చేస్తే, మరిన్ని డబ్బులు డిపాజిట్ చేయాలంటూ మాయమాటలు చెప్పి ఒక్కొక్కరి దగ్గర రూ. 10 వేల నుంచి రూ. 20 వేల వరకు వసూలు చేసి ఆపై ఫోన్ నంబర్ ను మార్చేది. రూ. 19 వేలు డిపాజిట్ చేసి మోసపోయిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, రంగంలోకి దిగిన వారు కేసును ఛేదించారు.