: మొయిన్ ఖాన్ ను క్షమించేసిన పీసీబీ!
పాక్ క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ మొయిన్ ఖాన్ ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) క్షమించేసింది. ఇకపై జూదశాలకు వెళ్లనని అతడు ఇచ్చిన హామీని బోర్డు పరిగణనలోకి తీసుకుంది. ఇక ఈ వివాదం సుఖాంతమైనట్లేనని పీసీబీ చీఫ్ షహర్యార్ ఖాన్ నిన్న ప్రకటించారు. స్నేహితులతో కలిసి జూదశాలకు వెళ్లిన మొయిన్ ఖాన్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన బోర్డు, ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న జట్టు వెంట వెళ్లిన అతడిని వెనక్కు పిలిచింది. దీనిపై విచారణ జరిపిన బోర్డు, మొయిన్ ఖాన్ తప్పేమీ లేదని తేల్చింది. విచారణలో భాగంగా ఇకపై జూదశాలకు వెళ్లబోనని మొయిన్ ఖాన్ హామీ ఇచ్చినట్లు వెల్లడించింది. ‘‘జూదశాలకు స్నేహితులతో కలిసి వెళ్లిన మొయిన్, వెంటనే హోటల్ కు తిరిగివచ్చేశాడు. మొయిన్ చీఫ్ సెలెక్టర్ గా కొనసాగుతాడు’’ అని షహర్యార్ ఖాన్ ప్రకటించారు.