: ఎన్ఎస్ఈఎల్ కుంభకోణంలో ముగ్గురు ప్రముఖ బ్రోకర్ల అరెస్ట్
నేషనల్ స్పాట్ ఎక్స్చేంజి లిమిటెడ్ లో జరిగిన కుంభకోణంలో ప్రమేయముందన్న అనుమానాలతో మంగళవారం నాడు ముగ్గురు ప్రముఖ స్టాక్ బ్రోకర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆనంద్ రాఠీ కమోడిటీస్ కు చెందిన అమిత్ రాఠీ, జియోజిత్ కాంట్రేడ్ కు చెందిన సీ.పీ. కృష్ణన్, ఇండియా ఇన్ఫోలైన్ కు చెందినా చింతన్ మోడీల అవకతవకల వల్ల ఎన్ఎస్ఈఎల్ సంస్థ పతనం అయిందని అధికారులు తెలిపారు. ముంబైకి చెందిన ఆర్థిక నేరాల విభాగం అధికారులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఆనంద్ రాఠీ, మోతిలాల్ ఒస్వాల్, జియోజిత్ కాంట్రేడ్, ఐఐఎఫ్ఎల్ లకు చెందిన ఉద్యోగులను పోలీసులు విచారించారు. ఎన్ఎస్ఈఎల్ గణాంకాల ప్రకారం ఈ బ్రోకర్లు ట్రేడింగ్ వ్యవస్థను ఆటాడుకున్నారు. క్లయింట్ల కోడ్ లను దాదాపు 3 లక్షల సార్లు అనధికారికంగా మార్చారు. ఒక పేరుతో లావాదేవీలు జరిపి మరో పేరుకు వాటిని బట్వాడా చేసేలా సిస్టంను మార్చారు. వాస్తవానికి క్లయింట్ల కోడ్ లను అత్యవసరమైతే మార్చే సదుపాయం ఉంది. దాన్ని అలుసుగా తీసుకొని వీరు తప్పుడు లావాదేవీలను లక్షల సంఖ్యలో జరిపారు. విచారణ జరిపి వీరిని చట్టం ముందు నిలబెడతామని అధికారులు వివరించారు.