: నేను అందర్లా ప్రపోజ్ చెయ్యలేదు... ధోనీ చెప్పిన ప్రేమ కథ
నేను సాక్షికి అందర్లా ప్రపోజ్ చెయ్యలేదని టీమిండియా కెప్టెన్ ధోనీ చెప్పాడు. ప్రపంచ కప్ సందర్భంగా స్టార్ టీవీ ధోనీతో చిన్నపిల్లల ఇంటరాక్షన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఓ తుంటరి పిల్లాడు 'ధోనీ, నీకు సాక్షి ప్రపోజ్ చేసిందా? నువ్వే సాక్షికి ప్రపోజ్ చేశావా? ఎలా చేశావ్?' అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. గడుగ్గాయి ప్రశ్నకు నవ్వేసిన ధోనీ, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? అన్నాడు. 'లేదు' అంటే, 'మరి ఎవరికైనా ప్రపోజ్ చేయాలనుకుంటున్నావా?' అని అడిగాడు. 'లేదు' అని బాలుడు సమాధానమివ్వడంతో నవ్వి, తన ప్రేమ కథను వివరించాడు. టీమిండియాకు ఆడుతుండగా, ఓ స్నేహితురాలి ద్వారా పరిచయమైన సాక్షికి తానే ప్రపోజ్ చేశానని చెప్పాడు. అయితే దానిని ప్రపోజ్ అనడం సరికాదని, ఎందుకంటే తాను ఐ లవ్యూ అని చెప్పలేదని అన్నాడు. 'విల్ యూ మ్యారీ మీ?' అని అడిగానని చెప్పాడు. దానిని సాక్షి పెద్దగా పట్టించుకోలేదని, క్రికెటర్ల జీవితాలపై ఉన్న రూమర్లతో తనను లెక్కచేయలేదని, నెమ్మదిగా తాను నిజంగానే పెళ్లి ప్రస్తావన తెచ్చానని అర్థం చేసుకుందని అన్నాడు. ఆ తరువాత రెండేళ్లు తాము డేటింగ్ చేశామని, తరువాతే పెళ్లి చేసుకున్నామని, ఈ నాలుగేళ్లు ఆనందంగా గడిపామని ధోనీ చెప్పాడు. ప్రేమ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, పెళ్లి చేసుకుంటేనే ప్రేమించాలని పిల్లలకు ధోనీ ఉద్బోధించాడు.