: ధోనీకి ప్యాంటు కొనాలంటే కష్టమే: జాన్ అబ్రహాం
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ప్యాంటు కొనాలంటే కష్టమేనని బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం తెలిపాడు. ప్రపంచ కప్ సందర్భంగా స్టార్ టీవీ ధోనీతో చిన్నపిల్లల ఇంటరాక్షన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. కొంత మంది చిన్నపిల్లలను ఎంపిక చేసి వారితో మాట్లాడించింది. చిన్న పిల్లలు వేసిన ప్రశ్నలకు ధోనీ సరదాగా సమాధానాలిచ్చాడు. ఈ సందర్భంగా మీకు బట్టలు ఎవరు తెస్తారని ఓ పిల్లాడు వేసిన ప్రశ్నకు ధోనీ, తన మిత్రుడు బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం చెప్పిన సమాధానం వినిపించారు. ధోనీకి బట్టలు కొనాలంటే ఎలా అనేది ఓ పట్టాన అర్థమయ్యేది కాదని జాన్ అన్నాడు. ఎన్ని షాపులు తిరిగినా ధోనీకి ప్యాంట్లు సూటయ్యేవి కాదని తెలిపాడు. ధోనీ తొడలు చెట్టు కాండాల్లా ఉంటాయని, అతని నడుము సన్నగా ఉండడంతో నడుము సైజ్ తీసుకుంటే అది తొడలపైకి ఎక్కదని, తొడల సైజ్ ని బట్టి ప్యాంట్ ఎంచుకుంటే నడుము లూజ్ అయిపోతుందని చెప్పాడు. అందుకే ధోనీ ప్యాంటు తీసుకుంటే అల్ట్రేషన్ చేయించుకోక తప్పదని అన్నాడు. దీంతో పిల్లలు ఘొల్లున నవ్వారు.