: జగడం ఆపి ప్రభుత్వ పాలన ప్రారంభించండి... పీడీపీ, బీజేపీలకు ఒమర్ అబ్దుల్లా హితవు
పీడీపీ-బీజేపీలు కలసి జమ్ము కాశ్మీర్ లో ప్రభుత్వం ఏర్పాటు చేయడం, ముఫ్తీ మొహమ్మద్ సయీద్ ముఖ్యమంత్రి కావడం కూడా జరిగిపోయాయి. అయితే ఆయనతో పాటు ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు ఇంతవరకు శాఖలు కేటాయించలేదు. దాంతో ఇంకా పాలన మొదలవలేదు. కానీ రెండు పార్టీల మధ్య అప్పుడే విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో ఆ రాష్ట్ర మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్ లో మండిపడ్డారు. వెంటనే ఇరు పార్టీలు జగడం ఆపి, పాలన ప్రారంభించాలని సూచించారు. "ప్రియమైన బీజేపీ, పీడీపీ! దయచేసి వివాదం ఆపండి. పాలన ప్రారంభించండి. రెండు నెలల నుంచి మేము ఈ ప్రభుత్వం కోసం ఎదురుచూస్తున్నాం. శాఖలు లేనిదే ఏమీ చేయలేరు" అని ట్విట్టర్ లో హితవు పలికారు. ప్రభుత్వం ఏర్పాటైన కొద్దిసేపటికే ముప్తీ అసెంబ్లీ ఎన్నికలపై వ్యాఖ్యలు చేయడంతో అసలు వివాదం మొదలైంది. ఇదే అదునుగా రెచ్చిపోయిన పీడీపీ ఎమ్మెల్యేలు, పార్లమెంటుపై దాడి కేసులో ఉరిశిక్షకు గురైన అఫ్జల్ గురు మృతదేహ అవశేషాలను అప్పగించాలంటూ కొత్త వివాదాన్ని లేవనెత్తారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి రాతపూర్వకంగా లేఖ కూడా రాశారు.