: ఇపుడే పెళ్లి వద్దంటూ వెబ్ సైట్ ప్రారంభించిన యువతి
వివాహం చేసుకోవాలని భావించి వెబ్ సైట్లలో వివరాలతో కూడిన ప్రొఫైల్ ఉంచేవారిని మనం చూశాం. కానీ ఓ బెంగళూరు టెక్కీ తాను అప్పుడే పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా లేనంటూ ఓ వెబ్ సైటును మొదలుపెట్టింది. ఆ వెబ్ సైటును ఇప్పటికే 2 లక్షల మందికి పైగా వీక్షించడం విశేషం. తమిళనాడుకు చెందిన ఇందుజా పిళ్లై (23) ప్రస్తుతం బెంగళూరులో ఒక స్టార్ట్ అప్ కంపెనీలో పనిచేస్తోంది. తల్లిదండ్రులు పెళ్లిసంబంధాలు చూడటం ప్రారంభించగానే, ఆమె అందరు అమ్మాయిల్లా కాకుండా వినూత్నంగా ఆలోచించింది. 'నా వయసు 23 ఏళ్లు. నేను ఇప్పుడే పెళ్లికి సిద్ధంగా లేను. ప్రస్తుతం ప్రపంచం అంటే ఏంటో తెలుసుకుంటున్నా. పెళ్లికి ఇంకా సమయం కావాలి. ఇండియాలో 30 ఏళ్లు దాటితే పెళ్లవదు అని ఎలా కల్పిస్తారో?' అంటూ, తన వివరాలను వెబ్ సైటులో అప్ లోడ్ చేసింది. కాగా, ఇందుజా వెబ్ సైటుకు నార్త్ ఇండియా నుంచి చాలా కామెంట్లు వస్తుండగా దక్షిణాది నుంచి మాత్రం అంత ఎక్కువ స్పందన రావడంలేదట. ఏది ఏమైనా వివాహానికి సంబంధించి తన నిర్ణయాన్ని తల్లిదండ్రులకు తెలిపి వారిని ఒప్పించేలా చేసానని ఇందుజా సంతోషంగా ఉంది. అన్నట్టు ఆమె ప్రారంభించిన వెబ్ సైటు పేరు http://marry.indhuja.com/