: రాహుల్ కంటే సచిన్ చాలా ఘోరం


కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కంటే లెజెండరీ మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఒక విషయంలో చాలా దారుణమైన స్థితిలో ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే, అత్యంత కీలకమైన బడ్జెట్ సమావేశాలకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరుకాకపోవడంపై విమర్శలు మిన్నంటాయి. రాహుల్ కొద్ది రోజుల పాటు సెలవు పెట్టారని కాంగ్రెస్ శ్రేణులు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ, రాహుల్ పై విమర్శలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అలాగే, సోషల్ మీడియాలో సైతం వ్యంగ్యాస్త్రాలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో, జరుగుతున్న డ్యామేజీని కొంతవరకు తగ్గించుకునే పనిలో పడింది కాంగ్రెస్. పార్లమెంటులో రాహుల్ గాంధీ హాజరు ఇప్పటివరకు 65 శాతం ఉందని చెప్పింది. ఆయనకంటే 120 మంది ఎంపీల హాజరు దారుణంగా ఉందని తెలిపింది. లోక్ సభలో శిబుసోరెన్, దీపక్ అధికారి, సన్వర్ లాల్ ల హాజరు 5శాతం కంటే తక్కువుందని తెలిపింది. అలాగే, రాజ్యసభకు 5 శాతం కంటే తక్కువగా హాజరైన వారిలో సచిన్ టెండూల్కర్, సినీనటి రేఖలు ఉన్నారని కాంగ్రెస్ వెల్లడించింది. ఈ విషయంలో, సచిన్ కంటే కూడా రాహుల్ గాంధీనే బెటర్ అని అర్థమవుతుంది.

  • Loading...

More Telugu News