: సెల్ దొంగను పట్టించిన సెల్ఫీ
పొరపాటున ఫోన్ పోతే ఓ పట్టాన దొరికిచావదు. అలాంటిది, ఓ దొంగ చేసిన పొరపాటు సెల్ ను యజమాని చెంతకు చేర్చింది. ఆస్ట్రేలియాలోని డైరన్ బీచ్ లో వేలంటైన్స్ డే వేడుకల్లో నికోలా షెల్టాన్ అనే యువతి తన ఐఫోన్ పోగొట్టుకుంది. కొన్ని రోజుల తర్వాత ఆ ఐఫోన్ తో సెల్ఫీ తీసుకున్న దొంగ దానిని ఫోన్ సొంతదారు నికోలా ఫేస్ బుక్ పేజీలో పోస్టు చేశాడు. ఈ విషయాన్ని నికోలా వివరిస్తూ ఫేస్ బుక్ లో పోస్టు చేసింది. దీనిని దాదాపు 20 వేల మంది షేర్ చేసుకున్నారు. దీంతో, ఫోన్ దొంగిలించిన వ్యక్తి దానిని పోలీస్ స్టేషన్ లో అప్పగించి, పొరపాటున దానిని తీసుకున్నానని పోలీసులకు చెప్పాడు. దానిని తీసుకున్న పోలీసులు ఆమెకు అప్పగించారు.