: అప్పుడే కేసీఆర్ ను టార్గెట్ చేసిన కొత్త పీసీసీ అధ్యక్షుడు
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడిగా నియమితులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి అప్పుడే టీఎస్ ముఖ్యమంత్రిని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వ తీరుపై విమర్శనాస్త్రాలను సంధించారు. ప్రజలను మభ్యపెట్టే విధంగా హామీలను ఇచ్చినందుకే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు. అధికారం చేపట్టి ఇంతకాలమైనా, ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. హైదరాబాదును లండన్ లా చేస్తాం, డల్లాస్ చేస్తామని అన్నారని, దళితులకు డబుల్ బెడ్ రూమ్ లు కట్టిస్తామన్నారని, ముస్లింలకు రిజర్వేషన్లన్నారని... ఏ ఒక్క అంశంపైనైనా ముందడుగు వేయగలిగారా? అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లందరినీ కలుపుకుని ముందుకు వెళతామని చెప్పారు.