: నడిరోడ్డుపై మహిళా దొంగను చితకబాదిన పోలీసు... నెట్లో హల్ చల్ చేస్తున్న వీడియో
ఒక మహిళా దొంగను లాఠీతో కుళ్లబొడిచిన కానిస్టేబుల్ ను విధుల నుంచి తప్పిస్తూ, మహారాష్ట్ర పోలీసు శాఖ నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే, జల్గావ్ లోని చాలీస్ గావ్ బస్టాండులో ఓ మహిళ తన పక్కనే వున్న మరో మహిళ మెడలోని బంగారు గొలుసును దొంగిలించడానికి ప్రయత్నించింది. బాధితురాలు గట్టిగా కేకలు పెట్టడంతో, పక్కనే ఉన్న పోలీసు శశికాంత్ జగన్నాథ్ మహాజన్ నిందితురాలిని పట్టుకుని నడిరోడ్డుపై చితకబాదాడు. అనంతరం, ఆమెను ఠాణాకు తీసుకువెళ్లాడు. శశికాంత్ ఆమెను లాఠీతో కొడుతున్నప్పుడు కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమ సైట్లలో పెట్టారు. ఆమె దొంగే అయినా, మహిళ అని కూడా చూడకుండా విచక్షణారహితంగా కొట్టడం విమర్శలకు దారితీసింది. ఈ వీడియో ఇప్పుడు నెట్లో హల్ చల్ చేస్తోంది.