: మెదక్ జిల్లాలో రిలయన్స్ గ్యాస్ లీక్... అధికారుల అప్రమత్తతతో తప్పిన ముప్పు
గ్యాస్ లీకేజీల కారణంగా ఎగసిపడుతున్న మంటలు ఏపీలోని తీర ప్రాంత జిల్లాలకే పరిమితం కాలేదు. పూర్తి మైదాన ప్రాంతంలోని తెలంగాణకు చెందిన మెదక్ జిల్లాలోనూ ఈ తరహా దుర్ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. నేటి ఉదయం మెదక్ జిల్లా సదాశివపేట మండలం మద్దికుంట సమీపంలో గ్యాస్ లీకేజీ కారణంగా మంటలు ఎగసిపడ్డాయి. కాకినాడ నుంచి గుజరాత్ కు గ్యాస్ ను తరలిస్తున్న రిలయన్స్ పైపులైనులో ఏర్పడ్డ లీకేజీ కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ప్రమాదంపై అధికారులు అప్రమత్తతతో వ్యవహరించడంతో పెను ముప్పే తప్పింది. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన అధికారులు గ్యాస్ సరఫరాను నిలిపివేశారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వస్తున్నాయి.