: మొత్తానికి పాక్ గెలిచింది...20 పరుగుల తేడా
పాకిస్థాన్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. పాకిస్థాన్-జింబాబ్వేల మధ్య ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ జయకేతనం ఎగురవేసింది. 20 పరుగుల తేడాతో జింబాబ్వేపై విజయం సాధించి తొలి విజయం నమోదు చేసింది. ఈ మ్యాచ్ లో ఇంకో విశేషం ఉంది. ఇంత వరకు వరల్డ్ కప్ లో జింబాబ్వే జట్టుపై పాకిస్థాన్ విజయం సాధించలేదు. తాజా విజయంతో మిస్బా సేన ఈ రికార్డును చెరిపేసింది. మిస్బా(73), వహాబ్ రియాజ్ (54) రాణించడానికి, ఉమర్ అక్మల్ (33) ఉపయుక్తమైన ఇన్నింగ్స్ ఆడడంతో నిర్ణీత 50 ఓవర్లలో పాక్ 7 వికెట్ల కోల్పోయి 235 పరుగులు చేసింది. ఓ మోస్తరు స్కోరుకు తోడు, చరిత్ర అనుకూలంగా ఉందని భావించిన జింబాబ్వే బ్యాట్స్మెన్ ను ఆదిలోనే దెబ్బతీశాడు పాక్ పొడగరి ఇర్ఫాన్ దీంతో ఓపెనర్లు తక్కువ వ్యవధిలో వెనుదిరిగారు. అనంతరం టేలర్ (50), విలియమ్స్ (33), హామిల్టన్ (29) రాణించినప్పటికీ విజయానికి కావాల్సిన పరుగులు చేయలేకపోయారు. చివర్లో చిగుంబర 20 చేయటంతో జింబాబ్వే స్కోరు 200 మార్కు దాటింది. 12 బంతుల్లో 28 పరుగులు చేయాల్సి ఉండగా, కేవలం ఎనిమిది పరుగులు చేసిన జింబాబ్వే 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.