: పవన్ కల్యాణ్... రాజధాని నిర్మాణానికి సహకరించండి: ఏపీ సీఎం చంద్రబాబు
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి సహకారం అందించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కోరారు. నేటి ఉదయం చంద్రబాబు నివాసంలో ఆయనను పవన్ కల్యాణ్ కలిసిన సంగతి తెలిసిందే. భేటీలో భాగంగా రాజధాని నిర్మాణం కోసం సేకరిస్తున్న భూములు, కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి జరిగిన అన్యాయం, తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరిగింది. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు, రాజధాని నిర్మాణానికి సహకారం అందించాలని పవన్ కల్యాణ్ ను కోరినట్లు చెప్పారు. అంతేకాక రాజధాని కోసం భూములిస్తున్న రైతులకు ఉదారంగానే పరిహారం ఇస్తున్నామని పవన్ కు వివరించానని చంద్రబాబు తెలిపారు.